ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ హోటల్ గదిలో చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ యువతిని గొంతు కోసి హత్య చేసిన అనంతరం, ఆమెతో కలిసి హోటల్లో బస చేసిన యువకుడు ఉరివేసుకుని మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వారణాసిలోని బాబత్పూర్ విమానాశ్రయ రహదారిపై ఉన్న కేజే హోటల్లో వికాస్ కేసరి (20), ప్రియా కేసరి (23) అనే యువతీయువకులు గత సోమవారం గది అద్దెకు తీసుకుని బస చేశారు. వీరిద్దరూ బంధువులని కథనంలో పేర్కొన్నారు.
అయితే, చాలాసేపటి వరకు హోటల్ గది తలుపు తెరవకపోవడంతో పాటు లోపలి నుంచి ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మాస్టర్ కీ సహాయంతో గది తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు.
అక్కడ కనిపించిన దృశ్యం పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గదిలోని బాత్రూమ్లో ప్రియా కేసరి గొంతు కోసిన గాయాలతో విగతజీవిగా పడి ఉంది. అదే గదిలో వికాస్ కేసరి ఉరివేసుకుని మరణించిన స్థితిలో కనిపించాడు. ప్రియాను హత్య చేసిన తర్వాత వికాస్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ నిపుణులు హోటల్ గదిని క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, ప్రియాకు మరొక వ్యక్తితో వివాహం నిశ్చయమైందనే విషయం ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు కథనంలో పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం, కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు తలెత్తాయా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అయితే, ఈ ఘటనకు అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply