ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో దీపావళి పండుగకు ముందు రోజు సాయంత్రం, అతివేగంగా వచ్చిన ‘థార్’ ఎస్యూవీ కారు ఢీకొని 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది.
కాన్పూర్‌లోని కళ్యాణ్పూర్ ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ సింగ్ చౌహాన్ (55) అనే వ్యక్తి, తన భార్య కోసం కొత్త చీర కొనుక్కుని తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి చేరుకోవడానికి కేవలం 500 మీటర్ల దూరం ఉందనగా, ఆ ప్రాంతంలో అతివేగంగా వచ్చిన ఓ థార్ కారు ఊహించని విధంగా అతడి స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న వేగానికి స్కూటర్‌ను సుమారు 25 నుంచి 30 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఆ కారు.. పక్కనే ఉన్న ఓ ప్రొఫెసర్ ఇంటి ప్రహరీ గోడను, జీఎస్టీ సూపరింటెండెంట్ ఇంటి ప్రహరీ గోడను బద్దలుకొట్టుకుని వెళ్లి తోటలో ఆగింది. ఈ ఘోర ప్రమాదంలో సంతోష్ అక్కడికక్కడే దయనీయంగా ప్రాణాలు విడిచాడు.
కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఒక మహిళ ఈ వాహనాన్ని నడిపిందని, కారులో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తికి సహాయం చేయకుండా, వారంతా మరో కారు ఎక్కి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఆ థార్ కారును స్వాధీనం చేసుకుని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పారిపోయిన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
పండుగ రోజున తన కుటుంబం కోసం ఎంతో సంతోషంగా చీర కొనుక్కుని వస్తున్న ఒక సామాన్యుడి ప్రాణాలు.. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల గాల్లో కలిసిపోవడం అందరి మనసులను కలచివేస్తోంది. తప్పు చేసిన వారిపై చట్టపరంగా ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply