ఇటీవలి కాలంలో భార్యలు తమ భర్తలను దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.
ఆగ్రాలో ఒక భార్య తన భర్తను చంపి, బాత్రూమ్లో పాతిపెట్టి, ఆ పైన టైల్స్ వేసి 45 రోజుల పాటు అదే బాత్రూమ్లో స్నానం చేసిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చి షాక్ ఇచ్చింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే, తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జూన్ 26న జరిగిన ఈ ఘటనలో, మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తను అతని భార్య ప్రీతి అలియాస్ వినీత సజీవదహనం చేసింది.
16 ఏళ్ల క్రితం అవధేష్ అలియాస్ పవన్ను వివాహం చేసుకున్న ప్రీతికి పిల్లలు లేరు. కూలీ పని చేసుకునే అవధేష్, ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడటం అలవాటుగా పెట్టుకున్నాడు. భర్త రోజువారీ వేధింపులతో విసిగిపోయిన ప్రీతి, ఘటన జరిగిన రోజున భర్త మత్తులో పడుకుని ఉన్నప్పుడు, మంచంపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. అనంతరం, తన భర్త బీడీ తాగుతుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందని, ఆ సమయంలో తాను బ్యాంకులో ఉన్నానని పొరుగువారికి మరియు పోలీసులకు అబద్ధం చెప్పి నాటకమాడింది.
అయితే, పొరుగువారికి కలిగిన అనుమానంతో పోలీసులు ప్రీతిని కఠినంగా విచారించగా, తన నేరాన్ని ఒప్పుకుంది. అంతేకాకుండా, పక్కింటి మహిళ ‘విమల’ ఇచ్చిన సలహా మేరకే తాను ఈ దారుణానికి ఒడిగట్టానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ప్రస్తుతం ఈ కోణంలో కూడా పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply