ఇంటర్నేషనల్ డెస్క్: అమెరికాలోని ఒక స్కూల్ టీచర్ (55) తన వద్ద చదువుకునే 16 ఏళ్ల మైనర్ విద్యార్థితో అనుచిత సంబంధం పెట్టుకుందనే ఆరోపణలు అక్కడ తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. సదరు మహిళా టీచర్ కేవలం మూడు నెలల కాలంలోనే ఆ విద్యార్థికి ఏకంగా 19,000 కంటే ఎక్కువ టెక్స్ట్ మెసేజ్‌లు పంపినట్లు, వీరిద్దరి మధ్య దాదాపు 600 ఫోన్ కాల్స్ నడిచినట్లు అధికారులు గుర్తించారు.
నిందితురాలిని అమాండా కాట్జ్ (Amanda Katz) గా గుర్తించారు. ఆమె ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, పరిపాలనా సహాయకురాలిగా (అడ్మిన్ అసిస్టెంట్) పనిచేసేవారు. పోలీసుల సమాచారం ప్రకారం.. డిసెంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో వీరిద్దరి మధ్య ఈ నిరంతర సంప్రదింపులు జరిగాయి.
తల్లికి తెలియడంతో బయటపడ్డ వ్యవహారం: నివేదికల ప్రకారం, ఆ విద్యార్థి తల్లికి వారిద్దరి మధ్య జరిగిన మెసేజ్‌ల గురించి తెలియడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక ఫ్యామిలీ ట్రిప్‌లో ఉండగా ఈ సందేశాలు తల్లి కంట పడ్డాయి, ఆ వెంటనే ఆమె ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. అధికారులు వారిద్దరి మధ్య జరిగిన వేలాది మెసేజ్‌లు, వందలాది కాల్స్ యొక్క రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.. పలు సందేశాలలో ఆ మహిళ విద్యార్థిపై తనకున్న విపరీతమైన భావోద్వేగ బంధాన్ని (ప్రేమను) వ్యక్తపరిచినట్లు తేలింది.
“నీ కోసం పిచ్చెక్కిపోతోంది” అంటూ మెసేజ్‌లు: కోర్టు దర్యాప్తు పత్రాల ప్రకారం.. ఒక మెసేజ్‌లో ఆ మహిళ, “నేను నీ గురించి ఆలోచించడం ఆపలేకపోతున్నాను” అని రాసింది. మరో సందేశంలో “నేను నీ కోసం పిచ్చెక్కిపోతున్నాను” అని పేర్కొంది. వీరిద్దరూ తమ భవిష్యత్తు ప్రణాళికలు, బంధం మరియు ఈ విషయాన్ని ఇతరుల నుండి ఎలా దాచాలనే అంశాలపై కూడా మాట్లాడుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆ ఉపాధ్యాయురాలు తనకు ఒక పాకెట్ నైఫ్ (చిన్న కత్తి) మరియు ఒక గేమింగ్ డివైజ్‌ను బహుమతులుగా ఇచ్చినట్లు సదరు విద్యార్థి విచారణలో వెల్లడించాడు.
ఆ విద్యార్థిని కుటుంబానికి దూరం చేసి, తనతో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కూడా ఆమె ప్రతిపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత విద్యార్థి ఆమెకు దూరం జరగడం ప్రారంభించడంతో.. ఆమె భావోద్వేగ మెసేజ్‌లు పంపుతూ తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
అరెస్ట్.. ఆపై బెయిల్: ఈ వ్యవహారం బయటపడటంతో అమాండా కాట్జ్ ఏప్రిల్ 30న తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు జూన్ 2న ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 25,000 డాలర్ల (దాదాపు ₹20 లక్షల కంటే ఎక్కువ) షూరిటీ బాండ్ సమర్పించడంతో ఆమెకు బెయిల్ లభించింది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, అందుబాటులో ఉన్న ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల ప్రవర్తనా నియమావళి మరియు మైనర్లతో ప్రొఫెషనల్ సరిహద్దులను ఉల్లంఘించడంపై ఈ ఘటన మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

Leave a Reply