రష్యాలో వైమానిక దళ దినోత్సవ వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 2,000 అడుగుల ఎత్తు నుంచి విమానం నుంచి దూకిన 41 ఏళ్ల రష్యా సైనికుడి పారాచూట్ తెరుచుకోకపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది.
మాస్కో సమీపంలోని వటులినో విమానాశ్రయంలో నిర్వహించిన వైమానిక విన్యాసాల కార్యక్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం నుంచి దూకిన సైనికుడి ప్రధాన పారాచూట్ అనూహ్యంగా తెరుచుకోలేదు.
దీంతో వేగంగా కిందకు పడిపోతున్న ఆయన ప్రాణాలు కాపాడుకునేందుకు అత్యవసర పారాచూట్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన భూమికి చాలా దగ్గరగా వచ్చేయడంతో, పారాచూట్ పూర్తిగా తెరుచుకునేందుకు తగిన సమయం లేకపోయింది. చివరకు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకాశం నుంచి వేగంగా కిందకు పడుతున్న సైనికుడిని చూసి నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మరో విషాదకరమైన విషయం ఏమిటంటే.. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ వైమానిక దళ సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలను ప్రశంసించిన కొద్ది గంటల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వేడుకల సందర్భంగా జరిగిన ఈ ఘోర ప్రమాదం రష్యాలో విషాదాన్ని నింపింది.

Leave a Reply