మైసూర్: వయసుతో నిమిత్తం లేని ఒక వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 37 ఏళ్ల మహిళ.. తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఏడాది పాటు సాగిన ఈ ప్రేమ కోసం సదరు మహిళ తన 14 ఏళ్ల కుమారుడిని సైతం వదిలేసి, ఆ యువకుడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ ఈ జంట మంగళవారం మైసూర్ ఎస్పీ (SP) ఆఫీసును ఆశ్రయించింది.
ఈ వ్యవహారం బెంగళూరులోని చల్లఘట్ట ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల కవిత, మైసూర్ పరిధిలోని రమ్మనహళ్లికి చెందిన 22 ఏళ్ల భాస్కర్ కు సంబంధించింది. భాస్కర్ బెంగళూరులోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ టీటీ (టెంపో ట్రావెలర్), ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. ఈ క్రమంలో, కవిత బందే మకాలమ్మ ఆలయానికి వచ్చినప్పుడు ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. కవిత భర్త 8 ఏళ్ల క్రితమే మరణించగా, ఆమెకు 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉండగా, భాస్కర్ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ కవిత తండ్రి బెంగళూరులోని కుంబళగోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇంటి నుండి వచ్చేసిన కవిత, భాస్కర్.. మైసూర్‌లోని ఒంటికొప్పలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే, కవిత బంధువు ఒకరు (మేనమామ కుమారుడు) తమను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఈ కొత్త జంట ఆరోపిస్తోంది. ఈ ప్రాణభయంతోనే బెంగళూరు వదిలి మైసూర్‌లోని రమ్మనహళ్లికి చేరుకున్నామని, ప్రస్తుతం తమకు రక్షణ కావాలంటూ పోలీసులను వేడుకున్నామని వారు తెలిపారు.
కవిత తన తండ్రి ఇంట్లో ఉంటూ హౌస్ కీపింగ్ పనులు చేసేదని సమాచారం. కుటుంబ సభ్యులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని భావించినప్పటికీ.. ఆమె మాత్రం భాస్కర్‌ను ఎంచుకుని ఈ అడుగు వేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply