జకార్తా: ఇండోనేషియాలో ఒక భారీ కొండచిలువ దాడిలో మహిళ ఘోర మృతి చెందింది. దాదాపు 25 అడుగుల పొడవున్న ఒక రెక్టిక్యులేటెడ్ పైథాన్ (భారీ కొండచిలువ) ఆ మహిళను పట్టుకుని, సజీవంగా మింగేయడానికి ప్రయత్నించింది. చివరకు ఆ మహిళ భర్త.. కొండచిలువ నోట్లోనే ఉన్న తన భార్య మృతదేహాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.
అసలేం జరిగిందంటే?
నివేదికల ప్రకారం.. ఉత్తర మాలుకు ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల ఎలిసాబెత్ యామ్‌లావ్ అనే మహిళ మంగళవారం మధ్యాహ్నం తన పశువులను చూసుకోవడానికి ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె పొలం సమీపంలో ఉన్న సమయంలో, పొదల్లో నక్కి ఉన్న ఒక భారీ కొండచిలువ ఆమెపై ఒక్కసారిగా దాడి చేసింది. ఆ పాము మొదట ఆమె కాలును కొరికి, ఆపై తన బలమైన శరీరంతో ఆమెను గట్టిగా చుట్టేసింది. ఆ మహిళ సహాయం కోసం కేకలు వేయడానికి ప్రయత్నించినప్పటికీ, అంతటి భారీ ప్రాణి చుట్టుముట్టడంతో ఆమె తనను తాను రక్షించుకోలేకపోయింది.
కొండచిలువ నోట్లోనే భార్య శరీరం:
సాయంత్రం అవుతున్నా ఎలిసాబెత్ ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె భర్త బెంజమిన్ లాంతో ఆమెను వెతకడానికి బయలుదేరాడు. ఇల్లు దాటి కొద్దిదూరం వెళ్లగానే అతనికి గుండె ఆగిపోయేంత భయంకరమైన దృశ్యం కనిపించింది. అతని భార్య శరీరం అప్పటికే సగానికి పైగా ఆ భారీ కొండచిలువ నోటి లోపల ఇరుక్కుపోయి ఉంది.
తన భార్యను కాపాడుకోవాలనే ఆరాటంతో బెంజమిన్ వెంటనే గొడ్డలితో ఆ కొండచిలువపై దాడి చేసి దానిని చంపేశాడు. కానీ, అప్పటికే జరగకూడదో నష్టం జరిగిపోయింది. శ్వాస అందకపోవడంతో ఎలిసాబెత్ అప్పటికే మృతి చెందింది. బెంజమిన్ పెట్టిన కేకలు విని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని, ఆ కొండచిలువ శరీరం నుండి మహిళ మృతదేహాన్ని బయటకు తీయడంలో సహాయం చేశారు.
ఇంటి తోటలోనే దాడి:
స్థానిక పోలీస్ చీఫ్ అద్నాన్ వహ్యూ కాశోగి ఈ ఘోర ఉదంతాన్ని ధృవీకరిస్తూ.. సదరు మహిళ తన ఇంటి సమీపంలోని తోటలో పని చేసుకుంటుండగా కొండచిలువ దాడి చేసిందని తెలిపారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి కూడా మహిళ శరీరంలో కొంత భాగం పాము నోట్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ రకమైన భారీ కొండచిలువ జాతులు (పైథాన్స్) ఎక్కువగా ఆగ్నేయాసియా (South-East Asia) లో కనిపిస్తాయి. ఇవి అడవులు, చిత్తడి నేలలు, నదులు మరియు కొన్నిసార్లు జనాభా ఉన్న ప్రాంతాల్లోకి కూడా చొరబడుతుంటాయి. సాధారణంగా ఇవి పక్షులు, ఎలుకలు, పిల్లులు మరియు ఇతర జంతువులను వేటాడతాయి. మనుషులపై దాడి చేసే కేసులు చాలా అరుదుగా జరుగుతుంటాయి.
ఊపిరాడకుండా చేసి చంపేస్తాయి:
భారీ కొండచిలువలు తమ శత్రువును లేదా ఆహారాన్ని పట్టుకున్నప్పుడు.. మొదట వాటి శరీరాన్ని గట్టిగా చుట్టేసి ఎముకలను విరగ్గొడతాయి. దీనివల్ల ఊపిరాడక బాధితులు ప్రాణాలు కోల్పోతారు. ఆ తర్వాతే అవి మెల్లగా బాధితులను పూర్తిగా మింగేయడానికి ప్రయత్నిస్తాయి.
ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘోర ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది కూడా 55 ఏళ్ల వా సిటీ అనే మహిళ తన తోటలో కూరగాయలు కోయడానికి వెళ్లి ఇలాగే కొండచిలువ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో కూడా ఆమె కుమారుడు వెతకడానికి వెళ్లగా.. తల్లి తల భాగం పాము నోటి లోపల ఉండి, ఆమె మృతి చెంది కనిపించింది. ఆ తర్వాత గ్రామస్తులు ఆ పామును చంపి మృతదేహాన్ని బయటకు తీశారు.

Leave a Reply