ఎయిర్టెల్ కస్టమర్లకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. కొన్ని నెలల క్రితం నిలిపివేసిన రూ.299 రీఛార్జ్ ప్లాన్‌ను సంస్థ మళ్లీ అందుబాటులోకి తెచ్చింది.
దీంతో తక్కువ ధరలో 28 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ చేసుకోవాలనుకునే వినియోగదారులు సంతోషించవచ్చు. అయితే, పాత ప్లాన్‌లో లభించిన ప్రయోజనాలు యథావిధిగా తిరిగి రాలేదన్నదే ఇందులో గమనించాల్సిన విషయం.
తిరిగి ప్రవేశపెట్టిన రూ.299 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నారు. రోజుకు 1 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీని ప్రకారం 28 రోజులకు మొత్తం 28 జీబీ ఇంటర్నెట్ డేటాను వినియోగించుకోవచ్చు. కానీ, ఈ ప్లాన్ గతంలో అందించిన రోజువారీ 1.5 జీబీ డేటాకు బదులుగా ప్రస్తుతం 1 జీబీ మాత్రమే లభిస్తోంది. అంటే రోజుకు 500 ఎంబీ (MB) మేర డేటాను తగ్గించారు.
గత ఆగస్టు నెలలో రూ.299 ప్లాన్‌తో పాటు రూ.319, రూ.579, రూ.619, రూ.649 తదితర కొన్ని ప్లాన్లను కూడా ఎయిర్టెల్ నిలిపివేసింది. ఆ తర్వాత 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న రోజువారీ ఇంటర్నెట్ డేటా ప్లాన్ కావాలనుకునే వారు రూ.349 ప్లాన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ ఇంటర్నెట్ డేటాతో పాటు అన్లిమిటెడ్ 5జీ సేవలు అందించేవారు. ప్రస్తుతం రూ.299 ప్లాన్ తిరిగి వచ్చినప్పటికీ, పాత ఇంటర్నెట్ డేటా ఆఫర్ మాత్రం తిరిగి రాలేదు.
ఇదిలా ఉండగా, ఎయిర్టెల్ సంస్థ కొత్త కస్టమర్లను చేర్చుకునే వేగం కూడా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య త్రైమాసికంలో (క్వార్టర్లో) సంస్థ కేవలం 7.16 లక్షల మంది కొత్త మొబైల్ కస్టమర్లను మాత్రమే చేర్చుకుంది. అంతకు ముందు త్రైమాసికంలో ఈ సంఖ్య సుమారు 33 లక్షలుగా ఉండేది. అందువల్ల, ఉన్న కస్టమర్లను నిలుపుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రూ.299 ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply