తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి మీరా వాసుదేవన్, తన మూడు వివాహాలకు సంబంధించిన చేదు అనుభవాలను పంచుకున్నారు.
ఇటీవల ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తన మూడు పెళ్లిళ్ల వల్ల జీవితంలో అత్యంత కీలకమైన 17 ఏళ్లను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయాన్ని వేరే విధంగా ఉపయోగించి ఉంటే సినిమా, ఫిట్‌నెస్, స్నేహితులు తదితర విషయాల్లో ఎంతో అభివృద్ధి చెందేదాన్నని.. అలాగే తన తల్లిదండ్రులు, చెల్లితో మరింత ఎక్కువ సమయం గడిపేదాన్నని ఆమె విచారం వ్యక్తం చేశారు.
మీరా వాసుదేవన్ 2005లో సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌ను వివాహం చేసుకుని, 2010లో అతనికి విడాకులు ఇచ్చారు. అనంతరం 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించగా, ఈ బంధం కూడా 2016లో ముగిసింది. ఆ తర్వాత 2024 మే నెలలో సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియాంకమ్‌ను మూడో వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.. 2025 ఆగస్టులో అది కూడా ముగిసింది. అయితే, ఈ మూడో పెళ్లికి ప్రేమ కారణం కాదని.. తన కొడుకుపై అతను చూపించిన ప్రేమ, శ్రద్ధ వల్లే తాను ఆ వివాహానికి ఒప్పుకున్నానని మీరా స్పష్టం చేశారు.
తన కొడుకుకు ఒక మంచి తండ్రి దొరుకుతాడనే నమ్మకంతో తాను తీసుకున్న నిర్ణయం తప్పుగా మారిందని మీరా పేర్కొన్నారు. ఏ బంధంలోనైనా శారీరక, మానసిక వేధింపులు, మోసం, ద్రోహం లాంటివి భరించాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. మూడు పెళ్లిళ్లు విఫలమైన మహిళగా సమాజం తన గురించి ఏమనుకుంటుందనే దాని గురించి తాను ఏమాత్రం ఆందోళన చెందడం లేదని, గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై ఎవరిపైనా ఆధారపడకుండా, తన కొడుకుకు ఆదర్శంగా నిలుస్తూ జీవితాన్ని కొనసాగించడమే తన లక్ష్యమని మీరా వాసుదేవన్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

Leave a Reply