ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మాచవరం గ్రామంలో ఉన్న ఆద్యశ్రీ డెయిరీ ఫామ్లో పెరిగిన ఓ ఆవు ఏకంగా రూ.5.30 లక్షలకు అమ్ముడుపోయింది.
పుంగనూరు జాతికి చెందిన ఈ ఆవును చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ జాతి ఆవు ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి అని డెయిరీ ఫామ్ యజమాని అడబాల ప్రేమ్ కుమార్ తెలిపారు.
ఈ ఫామ్లో స్వచ్ఛమైన పుంగనూరు జాతి ఆవులను పెంచుతున్నారు. ఇక్కడ పెరిగిన ఆవుల్లో ఒకదానినే చెన్నైకి చెందిన వ్యాపారవేత్త రూ.5.30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఆ ఆవును తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో కూడా ఈ ఫామ్ నుంచి పుంగనూరు ఆవులను వివిధ ప్రాంతాలకు పంపించారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (NDDB) దక్షిణ విభాగానికి సైతం ఓ ఆవును అందించినట్లు ఫామ్ యజమాని తెలిపారు.
ఈ ఆవు ఎత్తు కేవలం 36 అంగుళాలు మాత్రమే ఉంటుంది. చిన్న శరీరాకృతి, ప్రత్యేకమైన రూపం, మూపురం లాంటివి దీని ప్రత్యేకతలు. అంతేకాకుండా, ఇది రోజుకు రెండుసార్లు పాలిస్తుంది. ఒక్కోసారి సుమారు 3 లీటర్ల చొప్పున, రోజుకు మొత్తం 6 లీటర్ల పాలు ఇస్తుంది. దీని స్వచ్ఛమైన జాతి లక్షణాలు, ప్రత్యేకమైన శరీర ఆకృతే ఇంత భారీ ధరకు కారణమని చెబుతున్నారు.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ ఆవును కొనుగోలు చేసినట్లు ఆ వ్యాపారవేత్త ప్రతినిధి తెలిపారు. పూజల కోసం స్వచ్ఛమైన పాలు, పెరుగు, నెయ్యి పొందడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసమే ఈ ఆవును తమిళనాడుకు తీసుకెళ్తున్నారు. కేవలం 36 అంగుళాల ఎత్తు ఉన్న ఆవు రూ.5.30 లక్షలకు అమ్ముడుపోవడంతో ప్రస్తుతం పుంగనూరు ఆవుల ప్రత్యేకత అందరి మధ్యా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply