మహారాష్ట్రలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యాన్ని, దయనీయ స్థితిని కళ్లకు కట్టేలా అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
తీవ్ర పురిటి నొప్పులతో విలవిల్లాడిన ఓ నిండు గర్భిణి, తన ఇంటి గుమ్మం ముందే సగం ప్రసవమైన స్థితిలో పడి ఉన్న అమానవీయ ఘటన స్థానికులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది.
అన్నింటికంటే దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే.. ఆ మహిళ ఇంటికి కేవలం 50 అడుగుల దూరంలోనే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పటికీ, ఆమెకు సకాలంలో ఎలాంటి వైద్య సాయం అందలేదు.
తీవ్ర ప్రసవ నొప్పులు రావడంతో ఆ మహిళ ఆసుపత్రి వైపు చూస్తూ సాయం కోసం గట్టిగా కేకలు వేసింది. అయితే, ఆ సమయంలో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు గానీ, నర్సులు గానీ విధుల్లో అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆర్తనాదాలు ఎవరి చెవినా పడలేదు.
నొప్పితో రోదిస్తూ ఎలాగోలా ఆసుపత్రికి చేరుకోవాలని ప్రయత్నించిన ఆ మహిళ.. అంతకుమించి అడుగు ముందుకు వేయలేక తన ఇంటి గడప ముందే కుప్పకూలిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడింది.
ఆమె పెట్టిన కేకలు, ఆర్తనాదాలు విని పరుగెత్తుకొచ్చిన చుట్టుపక్కల మహిళలు పరిస్థితి తీవ్రతను గ్రహించి వెంటనే రంగంలోకి దిగారు. ఎలాంటి వైద్య పరికరాలు అందుబాటులో లేకపోయినా.. స్థానిక మహిళలే ఎంతో శ్రమించి ప్రథమ చికిత్స అందించి ఆ తల్లినీ, పసికందునూ ప్రాణాపాయం నుంచి కాపాడారు.
కేవలం 50 అడుగుల దూరంలోనే ఆసుపత్రి ఉన్నప్పటికీ సమయానికి వైద్యం అందక ఓ నిండు గర్భిణి నడిరోడ్డుపై ఇలా నరకయాతన అనుభవించడం మహారాష్ట్ర ప్రభుత్వ వైద్య వ్యవస్థ వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తోంది.

Leave a Reply