ఉత్తర కొరియా తన జాతీయ జెండా ఆకారాన్ని 78 ఏళ్ల తర్వాత తొలిసారిగా మార్చింది. ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ చేసిన ఈ మార్పు ప్రకారం, ఇప్పటివరకు 1:2 నిష్పత్తిలో ఉన్న జెండా పొడవు, వెడల్పుల కొలతను ఇకపై 1:1.65 గా మార్చారు.
దీనివల్ల పాత జెండాతో పోలిస్తే కొత్త జెండా వెడల్పు కాస్త తక్కువగా కనిపిస్తుంది. కానీ జెండాలో ఉన్న ఎరుపు, తెలుపు, నీలం రంగులు, మరియు తెల్లటి వృత్తంలో ఉండే ఎర్ర నక్షత్రంలో ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త రాజ్యాంగంలోని 166వ ఆర్టికల్‌లో ఈ మార్పును పొందుపరిచినట్లు సమాచారం.
ఉత్తర కొరియా గత 1948 సెప్టెంబర్‌లో తన జాతీయ జెండాను అధికారికంగా ఆమోదించింది. జెండా మధ్యలో ఉన్న ఎరుపు రంగు.. జపాన్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన విప్లవకారులకు ప్రతీక అని, తెలుపు రంగు స్వచ్ఛతను, నీలం రంగు శాంతి, స్నేహం మరియు స్వేచ్ఛను సూచిస్తాయని ఆ దేశం వివరించింది. ఎర్ర నక్షత్రం సోషలిజం మరియు విప్లవానికి ప్రతీక. ఈ నేపథ్యంలో జెండా రంగులు, చిహ్నాలను మార్చకుండా కేవలం దాని కొలతలను (నిష్పత్తిని) మాత్రమే మార్చడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. దీనికి ముందు 2024లో జాతీయ గీతంలోని పదాలను మార్చడంతో పాటు, దక్షిణ కొరియాతో తిరిగి ఏకం కావడానికి సంబంధించిన అంశాలను కూడా రాజ్యాంగం నుంచి తొలగించినట్లు చెబుతున్నారు.
ఈ మార్పులన్నీ ఉత్తర కొరియాకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ, జాతీయ గుర్తింపును సృష్టించేందుకు కిమ్ జోంగ్ ఉన్ చేస్తున్న ప్రయత్నంగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఒకే దేశంగా కలవాలనే పాత విధానం నుంచి వైదొలగి, రెండు దేశాలను వేర్వేరు శత్రు దేశాలుగా పరిగణించే వైఖరిని కిమ్ వ్యక్తపరుస్తున్నారు. తన తాత కిమ్ ఇల్ సంగ్, తండ్రి కిమ్ జోంగ్ ఇల్ పాలనాకాలం నాటి గుర్తింపుల నుంచి భిన్నంగా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ ఇమేజ్ను సృష్టించుకోవడానికి కూడా ఆయన పరోక్షంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే 78 ఏళ్ల నాటి జాతీయ జెండా ఆకృతిలో మార్పులు తీసుకొచ్చారనే చర్చ అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

Leave a Reply