2018 దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన బాల్ ట్యాంపరింగ్ వివాదంపై విచారణ జరిపేందుకు స్వతంత్ర ఫోరమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (CA) ప్రకటించింది.
ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ ‘సబర్’ (Sabr)లో కేప్ టౌన్ టెస్ట్ మాత్రమే కాకుండా, 2017-18 యాషెస్ సిరీస్, గెబెర్హా టెస్టులోనూ బాల్ ట్యాంపరింగ్ జరిగిందని, ఈ విషయం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ ముగ్గురికే కాకుండా జట్టు మొత్తానికి తెలుసని సంచలన విషయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, నెల రోజుల పాటు ఆటగాళ్లు, సిబ్బంది నుంచి రహస్యంగా వాంగ్మూలాలు సేకరించేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సీఈవో టాడ్ గ్రీన్బర్గ్ నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, బోర్డు ప్రకటనపై మాజీ ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ తీవ్ర అసంతృప్తి, అనుమానం వ్యక్తం చేశారు. వాంగ్మూలాలను రహస్యంగా సేకరించి, వాటిలో వేటిని మాత్రమే బహిర్గతం చేయాలో బోర్డే నిర్ణయించడం అనేది నిజాన్ని దాచిపెట్టడమేనని ఖవాజా మండిపడ్డారు. అంతేకాకుండా, మాజీ సహాయక సిబ్బంది ‘రహస్య ఒప్పందాలకు’ (NDAs) కట్టుబడి ఉండటం వల్ల వారు నిజం మాట్లాడలేని పరిస్థితి ఉందని, బోర్డు తనకు అనుకూలమైన సమాచారాన్ని మాత్రమే ఎంపిక చేసి బయటపెడితే ఈ విచారణ కేవలం కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుందని ఆయన ప్రశ్నించారు.
ఇదే అభిప్రాయాన్ని సమర్థించిన డేవిడ్ వార్నర్.. తమకు విధించిన 12 నెలల నిషేధం, జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఇప్పటికే అంగీకరించి శిక్ష అనుభవించామని, ప్రస్తుతం తమ డిమాండ్ శిక్షల గురించి కాదని, కేవలం పారదర్శకత, జవాబుదారీతనం గురించి మాత్రమేనని స్పష్టం చేశారు. మూసిన గదుల్లో రహస్యంగా విచారణ జరపడానికి బదులుగా, అందరూ నిర్భయంగా మాట్లాడగలిగేలా బహిరంగ స్వతంత్ర విచారణ నిర్వహించాలని వార్నర్ డిమాండ్ చేశారు.
ఎనిమిదేళ్ల నాటి విచారణను తిరిగి ప్రారంభించబోమని, ఎవరికీ కొత్త శిక్షలు విధించబోమని బోర్డు చెబుతున్న నేపథ్యంలో, నిజం పూర్తిగా బయటకు రాకపోతే ఈ వివాదానికి ఎప్పటికీ పరిష్కారం దొరకదని ఇద్దరు ఆటగాళ్లు తేల్చిచెప్పారు. ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటున్న తరుణంలో, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాల్లో మరోసారి పెను తుపాను రేపింది.

Leave a Reply