ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ప్రాంతంలో ఉన్న ఎస్.కె. నర్సింగ్ కళాశాలలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులకు, స్థానిక తెలుగు విద్యార్థినులకు మధ్య అర్ధరాత్రి పూట తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ కనిపించకుండా పోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఫోన్ చోరీ విషయమై తలెత్తిన వాగ్వాదం కాస్తా ముదిరి, చివరకు ఇరువర్గాలు బాహాబాహీకి దిగి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.
ఈ ఘర్షణ సమయంలో కళాశాల యాజమాన్యం, స్థానిక సిబ్బంది తమ గోడును పట్టించుకోకుండా స్థానిక విద్యార్థినులకే వత్తాసు పలికారని ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినులు ఆరోపించారు. తమకు న్యాయబద్ధమైన విచారణ దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు యాజమాన్యం రంగంలోకి దిగింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఈశాన్య రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 31 మంది విద్యార్థినులను తాత్కాలికంగా వేరొక హాస్టల్కు తరలించారు. ఈ ఘటనపై మణిపూర్ రాష్ట్ర నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినుల భద్రతను పటిష్టం చేయాలని కోరారు.

Leave a Reply